సమావర్తనము

విక్షనరీ నుండి

సమావర్తనము - స్నాతకము దీనినే స్నానము అని కూడా అంటారు. శరీరానికి ఆత్మ ఎలాగో, వివాహానికి ఈ స్నాన ఘట్టం అలాంటిది. ఒకప్పుడు తాను చదువుకోవడానికి గురువు దగ్గిరకి వెళ్ళాడు. 'ఉప' = గురువు దగ్గరకు, 'నయనం' = తీసుకొని వెళ్ళడం. అంటే, జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళిన శిష్యుడు తన చదువు ముగించుకొని తిరిగి రావడాన్ని సమావర్తనము అని అంటారు. యాగం అయిపోయాక చేసే స్నానం అవబృధం అంటారు. అశౌచం (ఎవరైనా చనిపోతే వచ్చే మైల) కలిగితే చేసే స్నానం శుధ్ధి స్నానం. అలాగే చదువు పూర్తి అయి తిరిగి వచ్చాక చేసే స్నానము సమావర్తనం. దీనికే స్నాతకం అని పేరు పెట్టింది శాస్త్రం. ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో జరిగే స్నాతకోత్సవం దీని ఆధారంగా చేసుకుని జరుగుతున్నదే. సమావర్తనానికి ముందు అక్కడ బ్రహ్మచారి ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటున్నాడు. అంటే, చదువు అయ్యాక గురువుల సమక్షంలో తాను చేసిన దోషాలని విప్పిచెప్పి క్షమించమని అడిగి ఆశీర్వాదం పొంది వెళతాడు. అయితే ఈనాడు Valedictory Function సంప్రదాయంగా జరుగుతోంది. మనకు సందేహం కలగవచ్చు. పెళ్లి చేసుకోవడానికి గురువుగారి అనుమతి దేనికి అని? చదువు చెప్పేవాడు గురువు. పెళ్ళికి గురువు అనుమతి ఇస్తున్నాడంటే చదువు పూర్తి అయింది అని చెప్పి ఆమోదించడం అని అర్ధం. రామచంద్రమూర్తికి వేదాధ్యయనం మాత్రమే అయోధ్యలో పూర్తి అయిందని, ఆ మీదట విశేష విద్యలైన అస్త్ర విద్య విశ్వామిత్రుని వద్ద పూర్తి అయింది అని, ఈ రహస్యం కారణంగానే ఏ విల్లు ఎక్కుపెడితే రాముడికి వివాహం అవుతుందో అలాంటి ధనుస్సు ఉన్న మిధిలకి ప్రయాణం కట్టించాడు విశ్వామిత్రుడు. కాబట్టి సాధారణ విశేష విద్యలన్నీ పూర్తి చేసి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి గురువు నుండి అనుమతి పొంది, తిరిగి రావడమే సమావర్తనం. వేడి నీళ్ళని చల్ల నీళ్ళలో పోసి, ఆ నీటితో అభ్యంగన స్నానం చేయించడమే ప్రధమంగా ఉంటుంది. వేడి నీటిలో చన్నీళ్ళను కలపడం వల్ల వైద్య శాస్త్ర రీత్యా (రొంప, జలుబు) అనే రోగాలు దరికి రావు. అలా కాకుండా నలుగుపిండిని రాసుకుని స్నానం చేస్తే అది దానికి ఉపశాంతి. మంగళస్నానం మన వారు ఆచరించేటప్పుడు తప్పకుండా నలుగుపిండి రుద్దుకోమనడం కూడా అందుకే. (పండుగలప్పుడు కూడా) స్నానమయ్యాక అతడు తనకి, తన గురువుకీ, చెవులకి ధరించడానికి కుండలాల్ని, వస్త్రాలని, గొడుగుని, రెండు చెప్పుల జతని, నలుగుపిండిని, తలంటు నూనెని తలపై ధరించే తల పాగాను గురువుకి సమర్పించి, తానూ ధరించి, ఇంకా పై చదువులకి కాశీకి బయలుదేరుతాడు. మనము ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న స్నాతకము ఇంకా ఒక రకంగా శాస్త్ర ప్రకారం జరగడం లేదు అని అనిపిస్తుంది. ఎంతమంది చెప్పులు, గొడుగు, ఇతర వస్తువులు గురువుగారికి కూడా ఇస్తున్నారు. గురువుగారు అంటే బ్రహ్మ స్థానంలో కూర్చున్న బ్రహ్మగారు కదా. మనమేదో అమ్మాయి తండ్రిని మాకు BATA shoes ఆధునికంగా ఉన్నవి, వెల ఎక్కువగా ఉన్నవి అడుగుతాం. ఎందుకంటే జన్మాంతరంలో వీడు మంచి చెప్పుల జత కూడా కొనుక్కోలేని బికారి అన్నమాట. మనం వివాహంలో మొదట క్రతువుతోటే గురువుగారిని అగౌరవ పరుస్తూ మొదలెడుతున్నాము. ఇలా అలంకరింపబడిన వరుడు కాశీకి వెళుతున్నాను అని బయలుదేరగానే వధువు యొక్క సోదరుడు వచ్చి, నా సోదరి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. పెద్దలు ఇరు వంశాలు వివాహానికి సరిపోయామంటున్నారు. ఓ వరుడా, అలంకరింపబడినదీ, యోగ్యురాలు అయిన నా సోదరిని నీకు ఇచ్చి వివాహం చేస్తాము, మీరు కాశీకి వెళ్ళద్దు అని బెల్లం ముక్క గడ్డం దగ్గిర పెట్టి వరుడిని బ్రతిమిలాడుకుంటాడు. వివాహ ఘట్టం మొదలు అవ్వడం బావమరిదితో మొదలై మళ్ళీ చివరికి బావమరిదితో చేసే లాజహోమంతో పూర్తి అవుతుంది. బావమరిది అంటే బ్రతక కోరుతాడు అని సామెత ఉండనే ఉంది కదా. ఎన్ని వైషమ్యాలు సోదరుడు, సోదరి మరియు బావగారి మధ్య ఉన్నా, బావమరిది ఏమి కోరుకుంటాడు అంటే, మా అక్క పిచ్చిది, ఏదో పది కాలాలపాటు పసుపు కుంకుమలతో, పిల్లా, పాపలతో ఉంటే చాలు. అలాగే మీరు మీ జీవిత కాలంలో ఏ కార్యక్రమం చేసినా బావమరిదిగా ముందుండి, మీరు చేసే కార్యక్రమాలు పూర్తి అయ్యేటట్లు నేను ముందుంటాను అని బెల్లం ముక్క పెట్టడానికి కారణం. బెల్లానికి నిలవ దోషం ఉండదు. కాబట్టి, బెల్లాన్ని పెట్టి వివాహవేదిక మీదకి ఆహ్వానిస్తాడు. అసలు స్నాతక వ్రతములో మణి కుండలాలను ధరించి ఉన్న ఆ వరుడు, ఏ స్థానాన్ని పొంది ఉన్నాడో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. అంత గొప్పదైన వ్రతము ఈ స్నాతకవ్రతము. కాని, చాలా బాధ కలిగే విషయమేమిటంటే అంత గొప్పదైన వ్రతాన్ని మనం ఎలా నిర్వహించాలో అలా నిర్వహించకపోవడమే. ఎందుకంటే స్నాతకం, వరుడి యొక్క గృహంలో నిర్వహించి చక్కగా విష్ణుస్వరూపుడిగా అలంకరింపబడిన వరుడితో మనము కళ్యాణ వేదిక దగ్గిరకి వెళ్ళాలి. కాని, మనకి ఇప్పుడు వివాహం అంటే ఏమిటి, ఎన్ని పూట్ల భోజనాలు అనే కదా. వరుడి తండ్రి, ఈ భోజనాల ఖర్చు కూడా మాకెందుకులే అని స్నాతకం కూడా కళ్యాణ వేదిక దగ్గిరే జరుపుతున్నారు. నది అడ్డంగా ఉంటే తప్ప, స్నాతకం వరుడి గృహంలోనే చేసుకోవాలి. అందుకే మన పెద్దలు ఇలా చెబితే వింటారో లేదో అని, స్నాతకము మరియు వివాహము ఒక వేదిక మీద జరగడానికి వీలులేదు అని చెప్పారు. అలా చెప్పినప్పుడైనా, వరుడి యొక్క తండ్రి ఎందుకు చెయ్యకూడదు అని అడిగితే, పెద్దలైన వారు ఎవరైనా గడ్డిపెట్టి మరీ చెబుతారు. స్నాతకం వరుడి ఇంట్లోనే జరగాలి అని. స్నాతకం అంటే, బ్రహ్మచారికి అనేక రొగాలకి ప్రాయశ్చిత్తం. సాధారణంగా వివాహం అయ్యేవరకు వరుడు అద్దం చూసుకోకూడదు. అలంకరించుకోకూడదు. అసభ్యకరమైనటువంటి పద జాలాలను వాడటం కాని, చూడటం కాని చేయకూడదు. అందమైన ఆడవారు కనిపించినప్పుడు, వారిని చూడడం కాని, వారితో పరాచకాలాడటం కాని చేయకూడదు. మరి అలాంటి బ్రహ్మచారి మరి ఇప్పుడు ఎవరు దొరుకుతారు. కాబట్టి, బ్రహ్మచారిగా ఉండి, తాను చేసిన దోషాలన్నింటికి ప్రాయశ్చిత్తం ఈ స్నాతకం. స్నాతకం, యజ్ఞోపవీతధారణ అర్హత ఉన్నవారు మటుకే చేసే క్రతువు ఉపనయనము. చిన్న వయసులో చేసి, అతడు ప్రతిరోజు సంధ్యావందనాది క్రియలు సక్రమంగా చేసినట్లు అయితేనే స్నాతకం, లేకపోతే అతనికి కూడా శమీవృక్ష దర్శనంతో (సంధ్యావందనాది అధికారం లేని ఇతర కులాలవారు చేసే ప్రాయశ్చిత్తం) సరి. పైగా, ఉపనయనం కూడా వివాహానికి ఒకటి రెండు రోజుల ముందు చేసుకునే ప్రబుద్ధులు ఉన్నారు. వారికి కూడా శమీవృక్ష దర్శనమే. అలాగే, స్నాతకుడై ఉన్న వరుడు ఎన్నో ప్రమాణాలు చేస్తాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధిదేవోభవ, నగ్నంగా స్నానం చేయనని వ్యక్తి శరీరాన్ని నాభి నుండి తలవరకూ, నాభి నుండి పాదాలవరకూ, అడ్డంగా రెండు భాగాలుగా చేశారు. నాభి నుండి క్రిందకి ఉన్న శరీరాన్ని రాక్షస శరీరం అని, తల వరకు ఉన్న శరీరాన్ని దైవ శరీరం అని అంటారు. ఈ రెండు శరీరాలను విభజించడానికి మొలకు త్రాడు కడతారు. స్త్రీలకు వడ్డాణం పెడతారు. దైవ శరీరాన్ని, రాక్షస శరీరాన్ని విడగొట్టే ప్రదేశం. ఎప్పుడూ వస్త్రంతో కట్టబడాలి. వర్షంలో తడవను అని, పరిగెత్తను అని, ఇప్పుడు వివాహానంతరం నా కోసం ఎదురు చూసే వారు ఉన్నారు, వారు నాకు అనారోగ్యం కలిగితే బాధ పడతారు అని, చెట్లు ఎక్కను అని, దిగుడు బావిలోకి దిగను అని, ఇలాంటి అనేకరకములైన ప్రమాణాలు చేసి వరుడు కళ్యాణవేదిక దగ్గిరకి బయలుదేరుతాడు. ఇంతటి పవిత్రమైన, మహోన్నతమైన స్నాతకాన్ని మనం అందరం శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఆచరించి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొనివెళదాము.రచన ప్రముఖ జ్యోతిష్కులు డా. కొమర్రాజు భరద్వాజ్ శర్మ

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • బ్రహ్మచారి (వటువు) గురుకులములో తన విద్యను పూర్తి చేసుకుని గృహస్థాశ్రామమును స్వీకరించుట కొరకు తన ఇంటికి వచ్చునప్పుడు చేయు సంస్కారము,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]