చర్చ:గానుగ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి

చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ’ అనేది చాలా ప్రసిద్ధి చెందిన సామెత. అంటే, ఎవరు ఎంత మంచి పని చేస్తే వాళ్ళకు అంత మంచి ఫలితాన్ని మహాదేవుడు ప్రసాదిస్తాడని అర్థం. ఇందుకు ఒక ప్రాచీన కథ ప్రచారంలో ఉంది.పూర్వం వంగ దేశంలో రత్నపురి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విశ్వేశ్వర శాస్ర్తి అనే అతడు ఉండేవాడు. ఆ దేశాన్ని విష్ణు శర్మ అనే రాజు పాలించేవాడు. ఒక రోజు ఆ రాజకు తన గత జన్మలో తానెవరో తెలుసుకోవాలనిపించింది.

తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పిన వానికి నిలువెత్తు స్వర్ణాభరణాలను బహూకరిస్తానని రాజు చాటింపు వేయించాడు. విశ్వేశ్వర శాస్ర్తి మహాదేవుని భక్తుడు. నిత్యం శివరామ జపం చేసేవాడు. అతడు చాలా బీదవాడు. భార్యా బిడ్డలు తిండిలేక పస్తులుంటుంటే చూడలేక ఇల్లు విడిచిపోవాలనుకున్నాడు. కాలినడకన బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ఒక శివాలయం కనిపించింది. రాత్రి కూడా కావచ్చింది. కాస్త విశ్రమించి వెళ్ళవచ్చునని ఆలయ మంటపంపై కూర్చున్నాడు.

ఒక సిద్ధుడు ఆలయంలోని శివ లింగానికి పూజ చేస్తున్నాడు. అతడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు.విశ్వేశ్వర శాస్ర్తి ఆ సిద్ధుడిని చూసి అతడు ఒక దివ్య పురుషుడనిపించి అతనిని సమీపించి తన దారిద్య్రాన్ని గూర్చి వివరించాడు. ‘ఈశ్వరుని సేవించేవారికి ఐశ్వర్యమే గాని దారిద్య్రం దరిదాపులకు రాదు.నీవు సకల సంపదలను పొందగలవు’ అని ఆ సిద్ధుడు విశ్వేశ్వరుని ఆశీర్వదించాడు. అతని చేతిలో కొన్ని అక్షింతలు పెట్టి ‘ఈ అక్షింతలు ఎవరిమీద చల్లితే వారికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. ఇవి తీసుకుని రాజు వద్దకు వెళ్ళు’ అని చెప్పి సిద్ధుడు వెళ్ళిపోయాడు.

విశ్వేశ్వర శాస్ర్తి రాజు వద్దకు వెళ్ళాడు. ‘రాజా! నీ పూర్వజన్మ విశేషాలు నీకు తెలిసే విధంగా నేను చేస్తాను’ అని కొన్ని అక్షింతలు అతని తలపై వేసి, కొన్నింటిని అతని చేతిలో పెట్టాడు. అవి తీసుకుని రాజు శ్రీపురం అనే ఊరిలో బురదలో నిద్రిస్తున్న ఒక పంది దగ్గరకు పోయి కొన్ని అక్షింతలు దానిపై వేశాడు. వెంటనే ఆ పంది ‘రాజా! నీవు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఈ ఊరిలోనే రామయ్య ఇంటిదగ్గర ఒక గానుగ ఎద్దు ఉంది. దాన్ని అడిగితే నీకు కావలసిన విషయం చెబుతుంది’ అన్నది.అప్పుడు రాజు గానుగ ఎద్దు దగ్గరకు పోయి దానిమీద కొన్ని అక్షింతలు చల్లాడు. ‘రాజా! నీ మంత్రి కూతురును అడుగు. నీకు అవసరమైన సమాచారం చెబుతుంది’ అని గానుగఎద్దు పలికింది.

మంత్రి కుమార్తె దగ్గరకు పోయి రాజు ఆమెపై అక్షింతలు చల్లాడు. అపుడు మంత్రి కూతురు ఇలా చెప్పింది- ‘రాజా! నీవు గత జన్మలో ఒక పేదవాడివి. నీకు ఒక కొడుకు, కోడలు, భార్య ఉండేవారు.ఒకనాడు మీరు భోజనం చేయబోయే సమయానికి ఒక బిచ్చగాడు ఆకలితో ‘మాతా! అన్నపూర్ణేశ్వరీ, పిడికెడు అన్నం పెట్టు’ అని అర్థించాడు. అప్పుడు నీ భార్య ‘మనకు ఉన్నదే కొంచెం.అందులో కొంచెం అతనికి పెట్టమని మీ నాన్న చెప్తాడు. మనం గదిలో కూర్చుని తిందాం రా!’ అని కొడుకును తీసుకొని పోయి చాటున కూర్చుని తిన్నారు. కానీ, నీవు మాత్రం నీకు ఉన్నదానిలో కొంత, నీ కోడలి కంచంలోనిది కొంత తీసి ఆ బిచ్చగానికి పెట్టావు.

ఆకలిగొన్న బిచ్చగాడు అది తిని తృప్తిపడి వెళ్ళిపోయాడు. ఆ పుణ్య ఫలం చేత నీవు రాజై పుట్టావు. నీ కోడలినైన నేను మంత్రి కూతురుగా జన్మించాను. ఆ గానుగ ఎద్దు నీ కుమారుడు. ఆ బురదలోని పంది నీ భార్య’. అందుకు రాజు సంతోషించి మంత్రి కుమార్తెను తన కుమారునకు ఇచ్చి వివాహం చేశాడు.విశ్వేశ్వర శాస్ర్తికి నిలువెత్తు స్వర్ణాభరణాలను బహూకరించాడు. తన కొలువులో మంచి ఉద్యోగమిచ్చి గౌరవించాడు. అప్పుడు రాజు చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అనేది యధార్థమని గ్రహించి అన్నదానాలతో, ధర్మకార్యాలతో ఈశ్వర సేవా తత్పరతతో జీవించాడు.

ఈశ్వరుడు సర్వమంగళ స్వరూపుడు. సకల జనులకు సౌఖ్యాలను, సుభాలను ప్రసాదించే పరమ కారుణ్యమూర్తి. శివుడు సర్వదేశ కాల వ్యవస్థితుడు కావడం వల్ల ‘భవుడు’ అని, సర్వ సంహారకుడు కావడం వల్ల ‘శ్వరుడు’ అని, లోక దుఃఖ వినాశకరుడు కావడం వల్ల ‘రుద్రుడు’ అని, మంగళకరుడు కావడం వల్ల ‘శంకరుడు’ అని, పరమానందాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ‘మహాదేవుడు’ అని ప్రస్తుతిస్తారు. పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు. జ్యోతి జ్ఞానానికి ప్రతీక. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే జ్యోతిని శాశ్వతంగా తమలో నిలచేట్లు చేయమని కార్తీకమాసంలో శివాలయాల్లో శివునికి దీపాలు వెలిగిస్తారు. విష్ణుమూర్తి నాలుగు నెలలుగా నిద్రించి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడు. అందుకే దీనికి శయన్యేకాదశి అనే పేరు ఏర్పడింది. అలాగే విష్ణుభక్తులకు కూడా కార్తీకమాసం దీపారాధనకు ప్రశస్తమైనది.

ఈశ్వరుడు తన భక్తులకు చక్కటి ప్రబోధం చేసే మాసం కావడం వల్ల కూడా కార్తీకమాసానికి ప్రబోధిని అనేపేరు కూడా వచ్చింది. ఉదాహరణకు ఒక శివ భక్తుడు కాశీనుంచి గంగాజలం తీసుకుని రామేశ్వరం బయలుదేరాడు. రామేశ్వర లింగానికి కాశీ గంగాజలంతో అభిషేకం చేస్తే ముక్తి లభిస్తుందని విశ్వాసం.అతనికి దారిలో ఒక గోవు దాహార్తిగా కనిపించింద. వెంటనే అతడు దానికి ఆ గంగాజలాన్ని పోశాడు. అతి తాగి గోవు మాయమై శివుడు ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! భూతదయ సర్వ శ్రేష్ఠమైన ధర్మం. నీవు పుణ్యాత్ముడవు. నీకు ఇప్పుడే మోక్షమిస్తాను’ అని చెప్పాడు. ఆ శివ భక్తుడు మహాదేవుని సందేశంతో పరమానందభరితుడయ్యాడు. పరమానందమే మోక్షం. ఇలాంటి జ్ఞానజ్యోతిని ప్రసాదించేవాడే మహాదేవుడు.

  • ఈ పైన ఉదహరించిన కథ ఇక్కడ అవసరము లేదు. ఈ కథను ఇక్కడ పొందు పరచిన వారు మరో చోట భద్ర పరచినట్లు తెలిపిన తదుపరి లేదా ఒక వారము రోజుల అనంతరము తొలగించబడును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:25, 13 సెప్టెంబరు 2012 (UTC)