Jump to content

తెలుగు విక్షనరీ అభివృద్ధి-T.sujatha

విక్షనరీ నుండి

అక్షరాలు చేరి పదాలు అవుతాయి. పదాలు చేరి కధలు , నవలలు, పద్యాలు, కావ్యాలు, నాటకాలూ అవుతాయి. భాష అనే వృక్షానికి అక్షరాలు మూలాలయితే పదాలు మొదలు (కాండం). దాని కొమ్మలూ రెమ్మలూ, పూలు, కాయలూ, పండ్లకు ఉపమానంగా కధలూ, కావ్యాలూ, భాషా సంభదిత సకలమూ అని చెప్పుకోవచ్చు. అటువంటి తెలుగు పదాలను గురించి తెలుసుకోవడానికి సహాయపడేదే విక్షనరీ. జానపదుల యాసతో కూడిన పదాలు సాధారణ వ్యవహార పదాలకు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే అనేక భాషలకు ఆలవాలమైన మన దేశంలో భాషలు వివిధ రూపాలను సంతరించుకుంటూ ఉంటాయి. మన తెలుగును పరిశీలిస్తే, ఒరిస్సా సరిహద్దులో ఉండే వాళ్ళది, తమిళ నాడు సరిహద్దులలో ఉండే వారిది,కర్నాటక సరిహద్దులలో ఉండే వారిది రకరకాల యాసలు. అలాగే వృత్తి సంబంధిత, కుల సంబంధిత యాసలు రకరకాలున్నాయి. మన కోస్తావారిలో నెల్లూరు , ఒంగోలు, తెనాలి , ఉభయ గోదావరి ప్రాంతాలు, సీమ ప్రాంతాలు , తెలంగాణా ప్రాంతపు పదాలు అనేకం. ఇలా వివిధ పదాలు, వాటి యాసలు, నుడికారాలు కలిగిన తెలుగు పదాలను ఒక చోట నిక్షిప్తం చేయటం, ఇతర భాషలనుండి తెలుగు లోకి, తెలుగు నుండి ఇతర భాషల అనువాద పదాల లింకులను చేర్చటమే విక్షనరీ ప్రాజెక్ట్ లక్ష్యం. అన్నట్టు తెలుగు విక్షనరీ అన్నది వీకీపీడియా సోదర ప్రాజెక్ట్. విక్షనరీ అనే పదం డిక్షనరీ నుండి ఉద్భవించినది. ఇది వీకీ (ఎవరైనా త్వరగా మార్పులు చేయగలగటం) కి అనుబంధం కనుక విక్షనరీ అయ్యింది.

నావిక్షనరీ ప్రవేశం

[<small>మార్చు</small>]

నేను సాధారణ గృహిణిని. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఇదీ అదీ అని తారతమ్యం లేకుండా ఆసక్తి కరమైనవి, లోకజ్ఞానం కలిగించేవి, విషయ ప్రాధాన్యం ఉన్నవీ అన్నీ చదవడం అలవాటే. కంప్యూటర్ గురించి ఇంట్లో మా అబ్బాయి వద్ద తెలుసుకున్నాను. అంతర్జాలంలో విహరించడం బాగా అలవాటు అయింది. కొత్త విషయాలు తెలుసుకునే ఆసక్తి నన్ను వీకీ పీడియాలో ప్రవేశించేలా చేసింది. మొదట్లో ఆంగ్లవీకీ చదవడంతో ఆరంభించి తరువాత తెలుగు వికీపీడియా (తెవీకీ) ఉందని గ్రహించాను. తెవీకీని చదవడం ఆరంభించాను. ఆ తరువాత ఎర్ర లింకులను నొక్కి చూసి అక్కడ సమాచారం ఏమీ లేక పోవడం చూసి నిరాశ కలిగింది. కాని ఎర్ర లింకులు ఉన్న చోట ఎవరైనా తనకు తెలిసింది వ్రాయవచ్చని గ్రహించాను. ఎవరైనా వ్రాయచ్చు అన్న విషయం నన్ను సంభ్రమ పరచింది. కాని ఏమి వ్రాయాలో ఎలా వ్రాయాలని సందిగ్ధంలో పడ్డాను. అందుకే చిన్న విషయాలైన జాతీయాలు వ్రాశాను. నేను వ్రాసింది పది మంది చదువుతారన్న విషయం నన్ను ఆనందపరచింది. ఆ తరువాత సామెతలు, అలా అలా చిన్న చిన్నగా వ్రాస్తూనే తెవీకీలో ఎలా వ్రాయాలో అన్న విషయం కొంత అర్ధం చేసుకున్నాను. ఆ సమయంలో (2006) నేరుగా తెలుగులో వ్రాసే వీలు లేదు. లేఖినిని ఉపయోగించి వ్రాసేదానిని. అప్పటి వరకు నేను సభ్యత్వం తీసుకోలని అనుకో లేదు. తరవాత చదువరిగారి పేజీలో సేకరించి పెట్టుకున్న ఆంగ్ల పదాలు కొన్నింటికి తెలుగు అనువాదం వ్రాసాను. అది చూసి చదువరి గారు నన్ను విక్షనరీ సభత్వం తీసుకొని అక్కడ పని కొనసాగించమని సూచించారు. సభ్యత్వం ఎలా తీసుకోవాలో ఆయనను అడిగి తెలుసుకున్నాను. తరువాత విక్షనరీ సభత్వం తీసుకున్నాను.చాలా ఆసక్తిగా కొంత కాలం అక్కడ నా పని కొనసాగించాను. వైఙాసత్య గారి ప్రతిపాదనతో వారి సహాయంతో నిర్వాకత్వం పొందాను. కాని తరువాత ఎక్కువ కాలం నేను విక్షనరీలో పని చేయక పోవడం కొంత విచారకరం.ఆ తరువాత కూడా తెవీకీ చదువుతూనే ఉన్నాను. తెవీకీ లో వ్యాసాలను ఎలా వ్రాయాలన్నది సాంకేతిక విషయాలు సహాయం శీర్షిక చదివి తెలుసుకున్నాను. వ్రాయడంలో కొంచెం ప్రగతి సాధించిన తరువత తెవీకీ లో వ్రాయాలన్న ఆసక్తి కలిగింది. తరువాత నేను తెవీకీ లో వ్యాసాలను వ్రాయడం మొదలు పెట్టాను. తెవీకీ లో వ్రాయడం నాకు చక్కని తృప్తి కలిగిస్తుంది.

విక్షనరీ

[<small>మార్చు</small>]

విక్షనరీ తెవీకీ అనుబంధ మాధ్యమం. ఇక్కడ పదాలకు అర్ధాలు, నానా అర్ధాలు, సంభంధిత పదాలు , పద ఉపయోగాలు , అనువాదాలు, మూలాలు మొదలైన ఉపయుక్తమైన విషయాలు ఉంటాయి.ఇతర భాషల వారు చూసినా అర్ధం చేసుకోవడానికి వీలుగా పదాలకు తగిన చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. నిజానికి ఇక్కడ వ్రాయడానికి ఎంతో ఉంది. ఇక్కడ జరుగ వలసిన పని మరింత ఉంది. ఎందుకంటే అనేక వేల పదాలు ఉంటాయి కదా! అనువాదాలు సమగ్రంగా చేర్చితే ఇతర భాషలలో పదానికి సమానార్ధం తెలుసుకునే వీలు ఉంది. అప్పుడే విక్షనరీ పలువురికి ఉపయోగపడగల అవకాశం ఉంది. ఇక్కడ జరగ వలసిన పని ఎంతో కాని జరిగినది మాత్రం స్వల్పమే.

విక్షనరీ అభివృద్ధి

[<small>మార్చు</small>]

నేను విక్షనరీలో సభ్యత్వం తీసుకోవడానికి ముందే చదువరి గారు, వైజా సత్య గారు,మాకినేని ప్రదీపు గారు విక్షనరీని ప్రారంభించి కొంత కృషి చేసారు. వారంతా విక్షనరీలో చేర్చ వలసిన పదాలకు కావలసిన మూసలను తయారు చేయడంలో ప్రయత్నాలుచేసి వారిలో వారు చర్చలు చేసి మూసకు ఒక రూపం తీసుకు వచ్చారు. మొదటి పేజీకి ఒక రూపం తీసుకు వచ్చి సభ్యులకు పని చేయడానికి తగిన సదుపాయం కలిగించారు. అంతే కాదు మూస విషయంలోనూ నాకు కావలసిన మార్పులు చేసుకోవచ్చని సూచలు ఇచ్చారు. వారి సహకారంతో విక్షనరీలో నాకు కావలసిన మార్పులు తీసుకు వచ్చి నా పని కొనసాగించాను. పదివేల దిద్దుబాట్లు దాటి పయనించాను. ఆ సందర్భంగా వైజా సత్యగారు విక్షనరీలో నా కృషిని గుర్తించి పతకాన్ని ఇచ్చి అభినందించారు. మాకినేని ప్రదీపు గారు విక్షనరీలో చేసిన కృషి మరువలేనిది. బాటును ఉపయోగించి ఆయన ఆంగ్లపదాల పేజీలను విక్షనరీకి చేర్చి విక్షనరీని మరింత సుసంపన్నం చేసారు. ప్రచంఢ మారుతంలా ఆయన చేసిన కృషి విక్షనరీకి ఎంతో ఉపయుక్తం అయింది. ప్రస్తుతం దాదాపు అనేక ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు విక్షనరీలో లభ్యం అవుతాయి. ఈ సందర్భంలో వైజా సత్య గారు, మాటల బాబు గారు మాకినేని ప్రదీపు గారి కృషికి గుర్తింపుగా పతకాలను ఇచ్చి సత్కరించారు. 2007లో చురుకుగా అభివృద్ధి చెందిన విక్షనరీ తరువాత కాలంలో కొంత వెనుకబడింది. అన్వేషి గారు విక్షనరీ మీద శ్రద్ధ చూపి పని చేసిన వారిలో ఒకరు. అప్పటి వరకు ఒక్కొక్క అక్షరానికి పేజీ సృష్టించిన నేను వారి సూచనతో ఆ పని కొంత ఆపి వేసాను. కొన్ని లక్షల పదాలు ఉన్న తెలుగు భాషకు పట్టికలు అవసరం లేదని నాకూ అనిపించింది. అందుకు కారణం అనుభవం ఉన్న సభ్యులు విక్షనరీ మీద శ్రద్ధ తగ్గించి తెవీకీ మీద శ్రద్ధ చూపడం. మిగిలిన సభ్యులు కొంత కృషి సాగిస్తున్నా అనుభవం కలిగిన సభ్యుల మార్గదర్శకత్వం కొరవడడం ఒక కారణమే. నా మటుకు నేను విక్షనరీలోపని చేసి చాలా కాలం అయింది.

సాంకేతికం

[<small>మార్చు</small>]

ప్రారంభంలో నేను ముందుగా తయారై వున్నపేజీలో దిద్దుబాట్లు చేసాను. తరువాత దిద్దుబాట్లు జరిగిన పేజీలను కాపీ చేసి కొత్త పదంలో అతికించి కొన్ని మార్పులు చేసి పేజీలను తయారు చేసాను. తరవాత విక్షనరీ మూస ఉందని తెలుసుకుని దాని సాయంతో పేజీలను సృష్టించాను. కొత్త పదం సృష్టించడానికి అక్షర క్రమంలో లింకులు తయారు చేసి దానిలో పదాల లింకులు తయారు చేసి దాని సాయంతో పేజీని సృష్టించాను. అందుకే అక్షరమాల అనే లింకును తయారు చేసాను. ఆ లింకుని అన్ని అక్షరాల పేజీలలో ఉంచాను. వాటి సాయంతో అనేక పదాలకు మొదటి పేజీకి వెళ్ళ కుండా కావలసిన పదానికి మార్పులు చేస్తూ వచ్చాను. కొత్త పదం సష్టించడానికి మూస అందు అందరికీ అందు బాటులో లేదు. తరువాత వైజా సత్య గారి సభ్య పేజీలో మూస ఉండటం గమనించాను. అన్వేషి గారు కొత్తగా మూసకు ఒక పేజీ సృష్టించారు. తరువాత అక్కడ నూతన పదాలను సృష్టించాను. ఆ తరవాత ఆ మూసను అందరికీ అందు బాటులో ఉండేలా అక్కడక్కడా చేర్చాను. తెలుగులో వ్రాయగలగడంతో విక్షనరీలో దిద్దుబాట్లచేయడం సులభతరం అయింది. విక్షనరీలో మార్పులు తీసుకురావడానికి నాకు ఇచ్చిన అనుమతి వలన సౌలభ్యం కొరకు నేను పదాల సృష్టిలో కొన్ని మార్పులతో మూసలను సృష్టించాను. ఉదాహరణగా కొత్తపదాల మూస మాదిరి నామవాచకము, సర్వనామము మొదలైన వాటికి ప్రత్యేక మూసలు ఉన్నాయి. నా అన్న లింకులో నామవాచక పదాలను వ్రాయ వచ్చు. ఈ మూసల వలన దిద్దుబాట్ల సమయం కొంత ఆదా చేయవచ్చు. ఇలా సాంకేతికంగా ఇతరులను చూసి నేర్చుకుని ముందుకు సాగాను.

విక్షనరీ వ్రాసే విధానం

[<small>మార్చు</small>]

ముందుగా కొత్త తెలుగు పదం అనే మూసలో మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగు లో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి పేజీ సిద్ధం ఔతుంది. మొదటి విభాగం వ్యాకరణ విభాగం దానిలో భాషా భాగం, వ్యుత్పత్తి, ఏకవచనం లేక బహువచనం అనే వాటికి మీకు తెలిసిన వివరణ ఇవ్వండి. రెండవది అర్ధ వివరణ అనే విభాగం. అందులో పదానికి తగిన అర్ధం వ్రాయాలి. తరువాత పదాలు అనే విభాగం ఉంటుంది. అందులో నానార్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. నానా అర్ధాలులో పదానికి ఉండే ఇతర అర్ధాలు సమాన అర్ధాలు వ్రాయాలి. సంబంధిత పదాలులో ఆ పదానికి సంబంధించిన పదాలు వ్రాయాలి. వ్యతిరేక పదానికి ఆ పదానికి ఉండే వ్యతిరేక పదం వ్రాయాలి.

మూడవ విభాగం పద ప్రయోగాలు అందులో ఆ పదాన్ని ప్రయోగిస్తూ వాక్యాలు, పాటలు, పద్యాలు ఉదహరించ వచ్చు. నాలుగవ విభాగం అనువాదాలు ఇది సమగ్రంగా తయారైతే ఎక్కువ ఉపయోగంగా వుండే విభాగం. ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ దిద్దుబాటులో ఆ భాషలకు లింకులు ముందే తయారుగా ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. అనువాదాలలో మరింత కృషి జరగ వలసి ఉంది. ఇతర భాషలతో పరిచయం ఉన్న తెలుగు వారు ఈ పని చేపట్ట వచ్చు. తరువాత విభాగం మూలాలు వనరులు ఇక్కడ పదానికి మూలాలు ప్రత్యేకంగా ఉంటే సూచించ వచ్చు. సాధారణంగా తెలుగు పదాలకు ప్రత్యేకమైన మూలాలు అవసరం లేదు. అందరికీ తెలిసే పదాలను చేర్చే సమయంలో మూలాలు వెతకనవసరం లేదు. తరువాత విభాగం బయట లింకులు. ఆంగ్ల వీకీ, తెవీకీ లింకులు ఇవ్వాలి. ఆంగ్లవీకీ లింకు ముందే ఉంటుంది. దానిలో పదానికి ఉండే సమానమైన ఆంగ్ల పదాన్ని వ్రాయాలి. ఈ లింకు ఆంగ్ల వీకీలో ఉండే వ్యాసానికి దారి తీస్తుంది. వర్గాలు విభాగంలో ఆ పదం ఏవర్గంలో చేరుతుందో వ్రాయాలి. చివరిగా ఎడిట్ పేజీలో మీకు అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయంతో ఆ పదానికి చిత్రాన్ని చేర్చగలిగితే భాష తెలియని వారికి కూడా పదమేమిటో అర్ధం ఔతుంది. ఇది చాలా ఉపయోగకరం. చిత్రాలు ఇప్పటికే లేక పోతే మీరే వికీలో ప్రవేశ పెట్టి (అప్లోడ్) పేజీలో చేర్చ వచ్చు. ఇతర వీకీల నుండి చేర్చ వచ్చు. అయితే సభ్యులు తమకు తెలిసిన ఏ విభాగంలోఅయినా వ్రాయ వచ్చు పూర్తిగా వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.

పదాల వనరులు

[<small>మార్చు</small>]

సాధారణంగా మాతృ పదాలకు మాలాలు ఉండవు. మనకు తెలిసిన పదాలు విన్నవి , చదివినవి వ్రాస్తాము. కాని వేమన పద్యాలను ఉదహరించడానికి పదాలను సష్టించాను. బాగా గుర్తు ఉన్న చలన చిత్రాలను ఉదహరించడానికి కొన్ని పదాలు వ్రాసాను. ఆంగ్లపదాల కొరకు కొన్ని పదాలు వ్రాసాను. తమిళ పదాల కొరకు కొన్ని పదాలను వ్రాసాను. వైద్యం, చెట్లు, ఆహారపదార్ధాలు, పక్షులు, పండ్లు, భావాలు ఇలా ఒక్కో వర్గానికి ఆలోచిస్తూ పదాలను ఎక్కుగా వ్రాసాను. జాతీయాలకు, సామెతలకు, నీతి వాక్యాలకు అనుగుణంగా పదాలను వ్రాసి వాటిని పద ప్రయోగం విభాగంలో ఉదహరించ వచ్చు. ఇలా ఎవరికి వారు ఊహించి వ్రాయ వచ్చు.

ముగింపు

[<small>మార్చు</small>]

విక్షనరీ అంటే ఏమిటీ, పదాల పేజీలు ఎలా వుంటాయి, సులభంగా ఎలా మనం తోడ్పడవచ్చు, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరించాను. మీరందరూ వీలుచేసుకొని, విక్షనరీకి మరింత అభివృద్ధికి తొడ్పాటు అందచేస్తారు కదూ. చివరిగా విక్షనరీలో నాకు చక్కని సహకారం అందించి నన్ను ప్రోత్సహించిన చదువరి గారికి,వైఙాసత్య గారికి,అన్వేషి గారికి, మాటలబాబు విశ్వనాధ్, మాకినేని ప్రదీపు గారికి ఇంకా ఇతర సభ్యులకు నా ధన్యవాదాలు