శాలివాహనుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక శకపురుషుడు. ఇతనిచే విక్రమార్కుఁడు చంపఁబడెను. ఇతఁడు నాగేంద్రుని వరప్రసాదమువలన కుమ్మర కన్నెకు జనించెను అని చెప్పెదరు. "శకకర్తా విక్రమజిత్‌ కానీన శ్శాలివాహనః" అని ప్రమాణము. పైఠణము అను పట్టణమునందు సోమకాంతరాజు రాజ్యము చేయుచుండఁగా అందు నీతిసంపన్నుఁడును ధార్మికుఁడును అయిన సులోచనుఁడు అను బ్రాహ్మణుఁడు ఒకఁడు ఉండెను. అతనికి సుమిత్ర అను కూఁతురు ఒకతె కలదు. దానికి నాలుగేండ్ల ప్రాయమున దాని తల్లి చనిపోయినందున తండ్రిచేతనే పెంపఁబడి వివాహము కాకమునుపే ఋతుమతి అయి దైవికముగా తటస్థించిన ఒక పురుషుని కూడి గర్భిణియు ఆయెను. అప్పుడు సుమిత్ర తనకు గర్భము కలుగుటచే తన్ను లోకులు నిందితురు అను వెఱపుచే చింతాక్రాంతయై తనయొద్దకు వచ్చుచున్న పురుషునితో తన మనోదుఃఖమును చెప్పెను. అందుకు అతఁడు నేను మనుష్యమాత్రుడను కాను ఆదిశేషుడను, నీకు నాసంగమము వలన శకకర్తయు పరాక్రమశాలియు అగు సత్పుత్రుడు జనింపగలడు. దీనిచే నీకుఁగాని నీ తండ్రికిఁగాని సంకటములు పొసగునెడ నన్ను తలపుము. నేను అప్పుడే వచ్చి మీసంకటములను తొలగించి పోయెదను అని చెప్పి తన నిజరూపమును చూపి అంతర్ధానము అయి పోయెను. అంతట ఈవర్తమానము అంతయు సుమిత్ర తన తండ్రితో చెప్పి అతడు దైవ సంకల్పము చొప్పున ఏది ఎట్లు జరగవలెనో అట్లు జరుగకపోదు అనిచెప్పి తన్ను మన్నింపగా, నిశ్చింత అయి ఉండెను. అనంతరము సుమిత్ర పెండ్లికాకమునుపే ఈడేఱుటయు వెంటనే గర్భము ధరించుటయు వారిచుట్టములకు అందఱకు తెలిసి ఈ తండ్రి బిడ్డలను వెలవేసి రాజునకును ఈవృత్తాంతము తెలిపిరి. అందులకు రాజు వారిని తన పట్టణము నుండి వెళ్లగొట్టించెను.

అంతట సులోచనుఁడు పట్టణమునకు వెలుపల ఒక కుమ్మరివాని యింట చేరి కాలము గడపుచు ఉండఁగా శాలివాహనుఁడు జనించి బాల్యమునందే తనతోడి బాలురను కూర్చుకొని తాను రాజు అనియు తక్కినవారు మంత్రి మొదలగువారు అనియు నిరూపించుకొని రాజ్యభారము చేయువానివలె ఆటలాడుచు ఉండెను. వీని ఆటలు చూచునట్టి కుంభకారులు అందఱు ఆశ్చర్యపడుచు మెచ్చుకొనుచు ఉందురు. అట్టియెడ శాలివాహనుడు ఆకుంభకారులను చూచి రాజు యొక్క దర్బారులో నడచునట్టి వ్యవహారముల నానాడు విచారించుకొని వచ్చి నాకు తెలియజేయుడు అని చెప్పఁగా వారును అట్లే చేయుచు ఉండిరి. అంత ఒకనాడు శాలివాహనుడు తన సహవాసులు అగు బాలుర తోడ కొలువుతీరి ఉండఁగా ఒక బ్రాహ్మణుడు వచ్చి ఎగతాళికి పంచాంగము చెప్పెను. అప్పుడు శాలివాహనుఁడు ఓ బ్రాహ్మణుఁడా మన రాజ్యమునకు యోగము ఎట్లున్నది అని అడిగెను. అందుకు ఆబ్రాహ్మణుడు మీ రాజ్యమునకు ఏమి లెస్సగా ఉన్నది అని చెప్పఁగా అచ్చట కుమ్మరావములో ఉన్న కడవ ఒకటి ఎత్తి అతనికి బహుమానముగా ఇచ్చి పంపెను. అది మఱునాడు స్వర్ణమయము ఐనందున ఈబాలుడు బంగారు కడవలు దానము చేయువాడు అని లోకమందు అంతట ఒక ప్రవాదము విస్తరిల్లెను. అనంతరము ఇతడు అచ్చటి కుమ్మరివారిచే ఏనుగులు గుఱ్ఱములు రథములు పదాతులు అనెడు చతురంగ బలములను మట్టితో చేయించుచు ఉండెను. అట్టియెడ ఈవృత్తాంతము అంతయు విక్రమార్కుఁడు విని వీనిని తన పట్టణమునకు రప్పించి చూచి సంభాషింపవలెను అని బహు ప్రయత్నములు చేసెనుకాని ఆయత్నములు ఏవియు కొనసాగక పోయెను.

అప్పుడు పురందరపురము అను పట్టణమునందు ఉన్న ధనంజయుడు అను ఒక వైశ్యుఁడు తన మరణకాలమున తాను పండుకొనెడు మంచము నాలుగుకోళ్ల క్రిందను ఉమక, బొగ్గు, మన్ను, ఎముకలును పాతిపెట్టి తన కొడుకులను నలువురను పిలిచి ఈమంచపు కోళ్ల క్రింద పూడ్చియుండు ధనమును మీరు నలుగురును సమభాగముగా పంచుకొని జీవింపుడు అని చెప్పి మరణమును పొందెను. ఆకుమారులును తండ్రికి జరగవలసిన అగ్నిసంస్కారాది క్రియలు నెఱవేర్చి తమ తండ్రి చెప్పినచొప్పున మంచపు కోళ్లక్రింద త్రవ్వి అందు కనబడిన వస్తువులను చూచి వానిని పంచుకొను విధము ఇట్టిది అని తెలియక అప్పుడు ప్రసిద్ధులై ఉన్న రాజులను న్యాయాధిపతులను తమకు విభాగ నిర్ణయము తెలుప ప్రార్థించి ఎవరివల్లను కాకపోగా, తుదకు విక్రమార్కుని యొద్దకు పోయి అతనివల్లను కాక పోవుటచే, ఇంక తిరిగి ప్రయోజనము లేదు అని నిస్పృహులై తమనివాసములకు పోవుచు మార్గవశమున ఈ శాలివాహనుడు ఉన్నచోటికి వచ్చిరి. అప్పుడు శాలివాహనుడు వారి సంగతి విచారించి పైనాలుగు వస్తువులను జ్యేష్ఠానుక్రమముగా ఒక్కొక్కడు ఒక్కొకదానిని తీసికోవలసినది అని మీ తండ్రి యభిప్రాయము. అది ఎట్లు అనఁగా పెద్దవానికి మట్టి ఇచ్చెను. (దానికి తన భూమి అంతయు అతనిది అని అర్థము.) రెండవవానికి ఉముక ఇచ్చెను. (దానికి తన ధాన్యమంతయు వానిది అని అర్థము.) మూడవవానికి బొగ్గు ఇచ్చెను. (దానికి బంగారు వెండి మొదలగు లోహద్రవ్యము సర్వమును అతనిది అని అర్థము.) నాలవవానికి ఎముకలు ఇచ్చెను. (దానికి గోధనము సర్వమును వానిది అని అర్థము.) అని భాగ నిర్ణయమును వివరించెను. వారు అది సరియైన తీర్పు అని సంతోషించి తమ పట్టణమున సుఖముగా ఉండిరి.

అనంతరము విక్రమార్కుడు ఈ వృత్తాంతమును విని శాలివాహనుని లోబఱచుకొనని యెడ తన కీర్తి మాసిపోవును అని ఎంచి చతురంగ బలములతో శాలివాహనుడు ఉన్న పట్టణమునకు రాఁగా ఆసంగతి తెలిసి శాలివాహనుడు మట్టితో చేయించి ఉండిన చతురంగ బలములను నాగేంద్రుని యనుగ్రహమువలన జీవము కలవానిగా చేసికొని ఎదిరించి విక్రమార్కుని చంపి అతని సైన్యమును నర్మదానది వఱకు తఱుముకొని పోయి అందుండి వెనుకకు మరలెను. కనుక నర్మదకు దక్షిణమున శాలివాహనశకమును ఉత్తరమున విక్రమార్కశకమును వాడబడుచు ఉన్నది. ఇతడు పిమ్మట మహాకవియై వైద్యశాస్త్రము, అశ్వశాస్త్రము, సప్తశతి అను అలంకార గ్రంథమును రచియించెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]